25 May, 2026 | 12:13 PM

800 అడుగుల లోయలో పడిన కారు: ఎనిమిది మంది మృతి

25-05-2026 10:31 AM

రాయ్‌గడ్: మహారాష్ట్ర(Maharashtraరాయ్‌గడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి 800 అడుగుల లోతైన లోయలోపడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది యువకులు మృతి చెందారు. ఈ దుర్ఘటన మహాబలేశ్వర్-పోలాద్‌పూర్ రహదారిపై(Solapur–Mahabaleshwar Road) అంబెనాలి ఘాట్ వద్ద చోటుచేసుకుంది. దాపోలి నుంచి సతారాకు ప్రయాణిస్తుండగా కారు లోయలో పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బైనాక్యులర్ల సహాయంతో లోయలో మృతదేహాలను గుర్తించిన పోలీసులు మృతులను సతారాకు చెందిన వారిగా నిర్ధారించారు.

 మృతులను మహేష్ అనిల్ పవార్ (25), ఆదిత్య అశోక్ సలుంఖే (21), రితేష్ రాజేంద్ర లోఖండే (25), సుహాస్ జితేంద్ర లోఖండే (20), అన్ష్ సమీర్ చవాన్ (18), ఉత్కర్ష్ ఆనంద్ షింగ్టే (21), అనిల్ అభిమన్యు షింగ్టే (35), నితిన్ కిసాన్‌కొండే (35)లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాద స్థలంలో ప్రస్తుతం మహాబలేశ్వర్ ట్రెక్కర్స్, ప్రతాప్‌గడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్, స్థానిక యంత్రాంగం ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.