ఓటములే నా గురువులు: సమంత
ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకూడదు.. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలని అంటున్నారు నటి సమంత(Actress Samantha). తన వ్యాపార ప్రయాణంలో ఎదురైన అనుభవాలను తాజాగా ఓ షోలో పంచుకున్నారు. తొలి వ్యాపార భాగస్వామ్యం(Business Partnership) ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని, అయితే ఆ వైఫల్యమే తనకు ఎన్నో విషయాలు నేర్పించిందని తెలిపారు.
తాను మొదటిసారి పెట్టుబడి(Investments) పెట్టిన వ్యాపారం విజయవంతం కాలేదని సమంత వెల్లడించారు. అయితే దాన్ని ప్రతికూల అనుభవంగా చూడలేదన్నారు. జీవితంలో విజయాల కంటే అపజయాల నుంచే ఎక్కువ నేర్చుకున్నానని చెప్పారు. గెలుపు కంటే ఓటమి ఇచ్చే అనుభవం విలువైనదని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
వ్యాపార రంగంలో తన ప్రయాణం గురించి చెబుతూ ఇప్పటివరకు సుమారు 8 నుంచి 10 సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమంత తెలిపారు. వాటిలో ఎనిమిది సంస్థలను మహిళలే స్థాపించడం తనకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలంటే మహిళలు కొంత భయపడుతుంటారని సమంత అభిప్రాయపడ్డారు. మహిళా పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడం తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెప్పారు. వ్యాపార రంగంలో మహిళలు మరింత ముందుకు రావాలని ఆమె వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహించారు. ప్రస్తుతం సమంత 'సెలబ్రిటీ మాస్టర్షెఫ్ తమిళం' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఆమె పంచుకున్న వ్యాపార అనుభవాలు, జీవిత పాఠాలు అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.