మహిళలపై ఓ పోలీస్ అధికారి దౌర్జన్యం
బతుకమ్మ, వినాయక చవితి వేడుకలకు అడ్డు తగులుతున్న అధికారి
ఘట్ కేసర్, అక్టోబర్ 13 (విజయక్రాంతి) : తెలంగాణ సాంప్రదాయాలను(Telangana tradition) కాపాడుకుంటూ పండుగలు జరుపుకుంటున్న మహిళలపై ఒక పోలీస్ అధికారి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అంబర్‌పేట ట్రైనింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న డిఎస్పీ బొమ్మినేని శ్రీరామ్ రెడ్డి తమను తీవ్రంగా బెదిరిస్తున్నారంటూ ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల బాలాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం కాలనీలోని మహిళలు విలేకరులతో మాట్లాడుతూ కాలనీలో మహిళలు బతుకమ్మలు, వినాయక చవితి వేడుకలను అత్యంత నిరాడంబరంగా నార్మల్ సౌండ్ స్పీకర్లు పెట్టుకుని బతుకమ్మ సంబరాల కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే సదరు డిఎస్పీ ఉద్దేశపూర్వకంగా అడ్డు తగులుతున్నారని కాలనీ ప్రెసిడెంట్ బొల్లా సుధీర్ రెడ్డి తెలిపారు.
పద్ధతి ప్రకారం మాట్లాడటానికి వెళ్లిన కాలనీ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి, సెక్రటరీ గొల్లపల్లి సిద్ధార్థ, మహిళలను ఆ అధికారి తీవ్ర పదజాలంతో దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేశారని బాధితులు వాపోయారు.
ఈ వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలంతా కలిసి పోచారం పోలీస్ స్టేషన్‌కు వెళితే, కనీసం లోపలికి కూడా అనుమతించలేదని ఆరోపించారు. రాత్రి ఒంటి గంట వరకు చిన్న పిల్లలను, మహిళలను స్టేషన్ బయటే నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు అధికారి గతంలో ఎందుకు సస్పెండ్ అయ్యారో ఒకసారి ఎంక్వైరీ చేయాలని,
ఆయన ప్రవర్తనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇలా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో ఉన్నతాధికారులు సిపి, డిజిపి స్పందించి మహిళలకు తగిన రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.