జాతీయ రహదారిపై ధర్నాలు చేస్తే కఠిన చర్యలు

13-10-2026 | 10:35pm

ప్రజా రవాణాకు ఆటంకం కలిగించవద్దు.. చట్టబద్ధ మార్గాల్లోనే సమస్యలు పరిష్కరించుకోవాలి

హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి హెచ్చరిక

హుజురాబాద్, (విజయక్రాంతి): సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలని, జాతీయ రహదారులపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి(ACP Vasamsetti Madhavi) హెచ్చరించారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

హుజురాబాద్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలిస్తూ, ఆధారాల సేకరణతో చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కేసుల విచారణకు కొంత సమయం పడుతుందని, ఫిర్యాదుదారులు పోలీసులపై నమ్మకం ఉంచి దర్యాప్తునకు సహకరించాలని కోరారు.

సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన బజ్జూరి తిరుమల (57) ఫిర్యాదు మేరకు ఈ నెల 9న క్రైమ్ నంబర్ 179/2026 కింద కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తిని విచారించి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు వెల్లడించారు. అయితే, ఈ నెల 11న తనకు న్యాయం జరగలేదంటూ చల్లూరి కోమల, మొలుగూరి లక్ష్మి మరికొందరు మహిళలతో కలిసి ఏసీపీ కార్యాలయానికి వచ్చారని, ఆ సమయంలో ఏసీపీ అందుబాటులో లేకపోవడంతో జాతీయ రహదారిపై సుమారు 30 నిమిషాల పాటు ధర్నా నిర్వహించారని తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 308/2026 కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు.

గతంలో బోర్నపల్లి గ్రామంలోనూ ఇదే తరహాలో ధర్నా చేయగా హెచ్చరించి వదిలేశామని, మళ్లీ రాస్తారోకోకు దిగడంతో ఈసారి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జాతీయ రహదారులపై ధర్నాల వల్ల అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన రోగులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడతారని, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

పోలీసుల దర్యాప్తు లేదా అధికారులపై ఫిర్యాదులు ఉంటే ముందుగా సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను, అక్కడ పరిష్కారం కాకపోతే ఏసీపీని, అవసరమైతే పోలీస్ కమిషనర్‌ను సంప్రదించాలని సూచించారు. చట్టంపై నమ్మకం ఉంచి శాంతియుతమైన, చట్టబద్ధమైన మార్గాల్లోనే సమస్యలను పరిష్కరించుకోవాలని ఏసీపీ వాసంశెట్టి మాధవి కోరారు.

మరిన్ని వార్తలు