పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలు కొరకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి మార్కెటింగ్, రవాణా, విద్యుత్, వ్యవసాయ, అగ్నిమాపక, తూనికలు కొలతలు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, సి.సి.ఐ. అధికారులతో కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2026-27 సీజన్ పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో 3 లక్షల 77 వేల ఎకరాలలో పత్తి సాగు జరిగిందని, 26 లక్షల 44 వేల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధర 8 వేల 667 రూపాయలుగా ప్రకటించిందని తెలిపారు. ఆయా జిన్నింగ్ మిల్లుల యజమానులు మిల్లులలో రక్షణ చర్యలు చేపట్టాలని, విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని, అగ్నిమాపక శాఖ అధికారులు మిల్లులను సందర్శించి రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
తూనికలు కొలతల శాఖ అధికారులు తూకం యంత్రాలను తనిఖీ చేసి స్పష్టమైన నివేదికలు సమర్పించాలని తెలిపారు. రైతులు కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పత్తిని విక్రయిస్తారని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎ.డి. అశ్వక్ అహ్మద్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్ జాడే, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.