వయోవృద్ధులను గౌరవిద్దాం
నిర్మల్ అక్టోబర్ 13 (విజయక్రాంతి): జిల్లాలోని వయోవృద్ధులను ప్రతి ఒక్కరు గౌరవించడం నేర్చుకోవాలని డి ఆర్ డి ఓ విజయలక్ష్మి(DRDO Vijayalakshmi) అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 189 మంది వయోవృద్ధులు స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వయోవృద్ధులు స్వయం సహాయక సంఘాలలో చేరడం వల్ల చేకూరే ఆర్థిక, సామాజిక ప్రయోజనాలపై ఈ సందర్భంగా వారికి సమగ్రమైన అవగాహన కల్పించారు. వయోవృద్ధులలో పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్థిక స్వావలంబన సాధించడం, సంఘాల ద్వారా పరస్పర సహకార ప్రాముఖ్యతను వివరించారు. వారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లభించే రకరకాల ప్రయోజనాలను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేశారు. వయోవృద్ధులతో బతుకమ్మలను స్వయంగా తయారు చేయించి, వారితో బతుకమ్మ ఆటపాటలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది, వయోవృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.