గ్రామీణ పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం
పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్
భూపాలపల్లి, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని(tourism sector) మరింత అభివృద్ధి చేయడంతో పాటు తెలంగాణ పండుగలు, సంప్రదాయాలు, జానపద కళలు, స్థానిక ఆహారపు రుచులను పర్యాటకులకు పరిచయం చేసేలా నూతన పర్యాటక విధానాన్ని రూపొందించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ9Department of Culture) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ సూచించారు.
మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గృహ వసతి కేంద్రాలను ఏర్పాటు చేసి, పర్యాటక శాఖ ద్వారా నమోదు చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిశీలన పూర్తి చేసి అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. గృహ వసతి కేంద్రాలను సౌకర్యాల ఆధారంగా వెండి, బంగారు విభాగాలుగా గుర్తించనున్నట్లు తెలిపారు.ఈ
సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ నెల 16న ఐడీఓసీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా యువజన, పర్యాటక శాఖ అధికారి చిర్ర రఘు గౌడ్, డీఆర్‌డీఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.