కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం
- మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- ప్రభుత్వ వైఫల్యంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం
- కరువు పరిస్థితులపై ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని పువ్వాడ డిమాండ్
ఖమ్మం, అక్టోబర్ 13(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) అసమర్థ పాలనతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar) అన్నారు. రాష్ట్రంలో నెలకొంటున్న కరువు పరిస్థితులు, సాగునీరు, విద్యుత్ కొరతతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావంపై గత తొమ్మిది నెలలుగా ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులకు అవసరమైన నీరు, విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
రైతుల సమస్యలపై తక్షణమే స్పందించి, సాగునీరు, విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.