దోమకొండలో పలు అభివృద్ధి పనుల పరిశీలన
ప్రత్యేకాధికారి జ్యోతి
దోమకొండ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): దోమకొండ మండల ప్రత్యేకాధికారి జ్యోతి(Jyothi, Special Officer of Domakonda Mandal) శుక్రవారం మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ఇందులో భాగంగా చేయూత పథకం వెరిఫికేషన్ ప్రక్రియను(Cheyutha Scheme Verification Process) పరిశీలించి, అర్హులైన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న మ్యాజిక్ సోక్‌పిట్లను(Magic Sockpits) పరిశీలించి, వాటి నిర్మాణం, వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణపై(Sanitation Management) అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. వర్షపు నీరు, మురుగునీటి నిర్వహణకు సోక్‌పిట్లను సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మధురిమ, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.