దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగిద్దాం
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యామ్‌సుందర్ రెడ్డి..
ఆలేరు, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): అంత్యోదయ సిద్ధాంతకర్త, మహోన్నత జాతీయవాది పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను(Pandit Deendayal Upadhyaya Jayanti celebrations) యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో(Yadadri Bhuvanagiri District Bharatiya Janata Party Office) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యామ్‌సుందర్ రెడ్డి(Jainapalli Shyam Sundar Reddy) మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న చివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు అందించాలనే అంత్యోదయ ఆశయంతో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పనిచేశారని గుర్తుచేశారు. ఆయన ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతం బీజేపీకి బలమైన సైద్ధాంతిక పునాదిగా నిలిచిందన్నారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ క్రమశిక్షణ, నిరంతర దేశ సేవ, సరళమైన జీవన విధానం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశాన్ని మరింత శక్తివంతంగా, స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్నం శ్రీనివాస్, కొప్పుల యాదిరెడ్డి, కదూరి అచ్చయ్య, సుర్వీ శ్రీనివాస్, రత్నపురం బలరాం, మంగు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.