సింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలి
- కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి
- సమస్యలపై ఈ నెల 30న సీసీసీ కార్నల్ లో ధర్నా
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్
నస్పూర్, (విజయక్రాంతి) : సింగరేణి సంస్థకు(Singareni Company) రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి(BJP State Vice President Raghunath Verabelli) డిమాండ్ చేశారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన రూ. 55 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిధులు సింగరేణి ఆర్థిక బలోపేతంతో పాటు సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి కీలకమని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు కార్మికుల సంక్షేమం(Workers' Welfare), భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సింగరేణి కార్మికుల హక్కులు(Rights of Singareni workers), సంక్షేమం, భద్రత కోసం ఆరు ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, అందులో 40 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపుగా లాభాల్లో న్యాయమైన వాటా అందించాలన్నారు.
కార్మికులకు మెడికల్ బోర్డు (Medical Board)విషయంలో జాప్యం లేకుండా ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అక్రమాలు, అన్యాయాలకు తావులేకుండా పారదర్శకంగా అర్హులైన కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.కార్మికుల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు రెండు గుంటల స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించుకునేందుకు బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
అవసరమైన పనిముట్లు, హెల్మెట్లు, సేఫ్టీ షూస్, ఇతర భద్రతా పరికరాలను నాణ్యతతో సకాలంలో అందించాలని కోరారు. డిస్మిస్ అయిన కార్మికుల కేసులను మానవతా దృక్పథంతో, నిబంధనలకు అనుగుణంగా పునఃపరిశీలించి, అర్హత ఉన్న కార్మికులకు మరో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
“కార్మికుల శ్రమకు గౌరవం – హక్కులకు రక్షణ – కుటుంబాలకు భద్రత” అనే లక్ష్యంతో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ పేర్కొన్నారు. సింగరేణి బలపడాలి... కార్మిక కుటుంబాలు బాగుపడాలని ఆయన కోరారు. కార్మికుల సమస్యలపై ఈ నెల 30న సీసీసీ కార్నల్ లో ధర్నా నిర్వహిస్తామని, దీనికి రాష్ట్ర అధ్యక్షులు, రాంచందర్ రావు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షు లు కమలాకర్ రావు, సీనియర్ నాయకులు బెర సత్యనారాయణ, నస్పూర్ పట్టణ అధ్యక్షులు కుర్ర చక్రవర్తి, నస్పూర్ జన ప్రధాన కార్యదర్శి చిరంజీవి, శ్రీరాంపూర్ ప్రధాన కార్యదర్శిలు పొన్నవేని సదయ్య, రమణవేని శ్రీనివాస్, శ్రీరాంపూర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు జిట్టవేణి రేణుక, ప్రధాన కార్యదర్శి బొంగోని శిరీష, సృజన, కార్మిక సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల మహేందర్, నాయకులు బొజ్జ నర్సయ్య, అటుకపురం సమ్మయ్య, బొద్దున రమేష్, బిఎంఎస్ ఏరియా సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.