రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

13-10-2026 | 04:22pm
  1. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
  2. విద్యుత్ కోతలపై చెల్పూర్ లో బిఆర్ఎస్ ఆందోళన

గణపురం, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(Former MLA Gandra Venkata Ramana Reddy) ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు మంగళవారం గణపురం మండలం చెల్పూర్‌లో ధర్నా నిర్వహించారు. పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యుత్‌ కోతలకు నిరసనగా ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించడంతో పాటు రైతుబంధు పథకంతో అండగా నిలిచారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

రైతులకు కనీసం ఎనిమిది గంటల విద్యుత్‌ కూడా సక్రమంగా అందడం లేదని, దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్‌ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

చెల్పూర్‌లో ప్రధాన రహదారిపై నిర్వహించిన ధర్నాతో సుమారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆందోళనలో బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు