అల్లుడికి దిష్టి తీసి వస్తుండగా మృత్యువాత

06-11-2026 | 11:16am

కామారెడ్డి, నవంబర్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి మండలం కొట్టాలపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి తండ్రి, కుమార్తె మృతి చెందారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాలకు చెందిన సుంకరి పెద్ద నరసయ్య (60), లింగాయపల్లిలో నివసిస్తున్న ఆయన కుమార్తె సోమిశెట్టి రజిత (42) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

రజిత భర్త మల్లేశం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అల్లుడికి దిష్టి తీసేందుకు నరసయ్య వెళ్లారు. దిష్టి తీసిన అనంతరం వాటిని సమీపంలోని కొట్టాలపల్లి చెరువులో పడేసేందుకు వెళ్లగా, ప్రమాదవశాత్తు చెరువులోని లోతైన గుంతలో చిక్కుకున్నారు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన కుమార్తె రజిత కూడా చెరువులో జారిపడి మృతి చెందారు.

రాత్రి సమయం కావడంతో ఈ ఘటనను ఎవరూ గమనించలేదు. శుక్రవారం ఉదయం చెరువు వద్ద వారి ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దేవునిపల్లి ఎస్సై రంజిత్ ఆధ్వర్యంలో పోలీసులు చెరువులో నుంచి నరసయ్య, రజిత మృతదేహాలను వెలికితీశారు.

చెరువులోని గుంతలో ప్రమాదవశాత్తు చిక్కుకోవడంతోనే తండ్రీకూతుళ్లు మృతి చెందినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

మరిన్ని వార్తలు