విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలకు జిజ్ఞాస వేదిక

06-11-2026 | 10:19pm

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు

ఆదిలాబాద్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, పరిశోధనాత్మక దృక్పథం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు జిజ్ఞాస ప్రాజెక్టులు(Jignasa Project) ఎంతగానో దోహదపడుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) అన్నారు. రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులకు శుక్రవారం స్థానిక ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల(Government Science Degree College)లో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఐదు విజేత బృందాలకు నగదు బహుమతుల చెక్కులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి, సమాజంలోని సమస్యలను అధ్యయనం చేయాలని సూచించారు. చరిత్ర, గిరిజన సంస్కృతి, అడవులు, వన్యప్రాణులు, గణితశాస్త్రం, స్మార్ట్ హెల్త్‌కేర్ సిస్టమ్స్ వంటి విభిన్న అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అభినందనీయమన్నారు.

పుస్తక జ్ఞానంతో పాటు సమాజ సమస్యలను అన్ని కోణాల్లో విశ్లేషించి, వాటికి పరిష్కారాలు అన్వేషించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ లు డాక్టర్ సంగీత, డాక్టర్ అతీక్ బేగం, ప్రతాప్ సింగ్, జిజ్ఞాస జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్, సూపర్‌వైజర్లు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు