మూన్‌పై పొటాటోస్.. శాస్త్రవేత్తల అద్భుతం

20-11-2026 | 01:32pm

చంద్రుడిపై మనుషుల నివాసానికి మరో అడుగు.. అక్కడే ఆహారం సిద్ధం!

చంద్రుడిపై మనుషులు నివసించే రోజులు దగ్గరపడుతున్నాయా? అక్కడికి వెళ్లిన వ్యోమగాములు ఆహారం కోసం భూమిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేయడానికి శాస్త్రవేత్తలు కీలక ప్రయోగం చేపట్టారు. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని పోలిన పదార్థంలో బంగాళాదుంపలను విజయవంతంగా పండించారు. ఈ ప్రయోగం అంతరిక్ష వ్యవసాయం (Space Farming) దిశగా కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. నాసా మద్దతుతో ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు npj Microgravity సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భవిష్యత్తులో చంద్రుడిపై స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే సమయంలో అక్కడే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఐదు రకాల మట్టి నమూనాల్లో ప్రయోగాలు

ఈ పరిశోధన కోసం 'మోడోక్' (Modoc) రకానికి చెందిన బంగాళాదుంపలను ఎంచుకున్నారు. చంద్రుడిపై ఉండే మట్టిని పోలిన ఐదు రకాల నమూనాల్లో వాటిని పెంచేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రుడి మట్టిలో మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజని, సేంద్రియ పదార్థాలు సహజంగా ఉండవు. అందుకే ఎలాంటి అదనపు పోషకాలు కలపకుండా మొక్కలను పెంచినప్పుడు ఆశించిన ఫలితాలు రాలేదు. వేర్లు, బంగాళాదుంప దుంపలు కూడా ఏర్పడలేదు. కానీ ఈ మట్టి నమూనాల్లో వానపాముల వ్యర్థాలతో తయారయ్యే సేంద్రియ ఎరువు (Vermicompost) కలిపిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కేవలం 5 శాతం ఎరువు కలిపిన మట్టిలోనే మొక్కలు వేర్లు తొడిగి, దుంపలను ఏర్పరచడం ప్రారంభించాయి. అదే 30 శాతం సేంద్రియ ఎరువు కలిపిన నమూనాలో పండిన బంగాళాదుంపల దిగుబడి.. ఒరెగాన్‌లోని భూమి మట్టిలో పండిన పంటకు సమానంగా ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది.

బంగాళాదుంపల్లో పోషకాలు.. కానీ ఓ జాగ్రత్త!

ఈ ప్రయోగంలో పండిన బంగాళాదుంపలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. వాటిలోని పోషక విలువలు చాలా వరకు సురక్షిత స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే కొన్ని నమూనాల్లో భార లోహాల (Heavy Metals) శాతం స్వల్పంగా పెరిగినట్లు తేలింది. కాబట్టి చంద్రుడిపై పండించిన ఆహారాన్ని మనుషులు నేరుగా తినవచ్చా? అనే అంశంపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రధాన పరిశోధకుడు ఐమెరిక్ గోయర్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుడి మట్టిలో నత్రజని లేకపోవడంతో అవసరమైన పోషకాలను బయట నుంచి అందించాల్సి ఉంటుంది. అప్పుడే మొక్కల పెరుగుదల సాధ్యమవుతుంది.

ఆర్టెమిస్ మిషన్‌కు ఉపయోగపడే పరిశోధన

నాసా చేపట్టిన ఆర్టెమిస్ (Artemis) కార్యక్రమం ద్వారా చంద్రుడిపై మానవుల దీర్ఘకాలిక నివాసానికి మార్గం సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భూమి నుంచి ప్రతిసారీ ఆహారాన్ని అంతరిక్షంలోకి పంపడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చంద్రుడిపైనే పంటలు పండించగలిగితే వ్యోమగాములకు ఆహార సరఫరా సులభమవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తక్కువ స్థలంలో ఎక్కువ కేలరీలు అందించడంతో పాటు పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలు కలిగి ఉండటం వల్ల బంగాళాదుంపలను Space Farmingకు అనువైన పంటగా పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రయోగాలు భూమిపైనే గ్రీన్‌హౌస్‌లో, చిన్న కుండీల్లో నిర్వహించారు. భవిష్యత్తులో పెద్ద కంటైనర్లలో మరిన్ని పరీక్షలు చేసి, చంద్రుడి వాస్తవ పరిస్థితుల్లో వ్యవసాయం సాధ్యమవుతుందో లేదో నిర్ధారించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు