ఎల్బీనగర్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు
- సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన దళిత సంఘం నాయకుడు రవికుమార్
ఎల్బీనగర్, నవంబర్ 20 : ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల పంపిణీలో(Distribution of pensions) అధికారుల విధులను అడ్డుకుని, గొడవ సృష్టించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యేపై(LB Nagar MLA) చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగోల్ డివిజన్ జైపురి కాలనీలో(Jaipuri Colony, Nagole Division) ఉన్న బ్లైండ్స్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఊరిపక్క రవికుమార్ డిమాండ్ చేశాడు. ఈ మేరకు సరూర్ నగర్ సీఐ శ్రీశైలానికి ఫిర్యాదు పత్రం అందజేశాడు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ... ఈ నెల 18న చంపాపేటలోని ప్రభుత్వ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎల్పీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పింఛన్ల పంపిణీలో తీవ్ర ఇబ్బందులు కలిగించారన్నారు.
ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ, వారి పనికి ఆటంకం కలిగిస్తూ సుధీర్ రెడ్డి, ఆయన అనుచరులు 30 మందికి పైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకొని అధికారులు, పింఛన్లదారులపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్, రాకేశ్ ఠాకూర్, తిలక్ రావు, రవి ముదిరాజ్, జక్కిడి రఘువీర్ రెడ్డి, మాధవరం నర్సింహారావు, నవీద్, గండికోట శ్రీనాథ్, నజీర్ షేక్, మునగాల రాఘవేందర్ రావు, సన్నీ యాదవ్, అరుణ్ రెడ్డి, జక్కిడి మనోజ్ రెడ్డి, తోట మహేశ్ యాదవ్, కోమల్ యాదవ్, అబ్బాస్ ఖాన్, ఎండి ఖలీముద్దీన్, షేక్ సర్వర్, మోబిన్, ఫయాజ్, అబ్దుల్లా తదితరులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ డేరంగుల కృష్ణ, చింతలకుంట డివిజన్ చైర్మన్ బాలకృష్ణ, గడ్డి అన్నారం డివిజన్ చైర్మన్ అనసూయ శాంతి, హస్తినాపురం డివిజన్ చైర్మన్ షాగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.