చుక్కా రామయ్య 101వ జన్మదినం.. కిషన్ రెడ్డి పాదాభివందనం
హైదరాబాద్: విద్యకు వయసుతో సంబంధం లేదని నిరూపించిన అరుదైన వ్యక్తిత్వం చుక్కా రామయ్య(Chukka Ramaiah). తెలుగు రాష్ట్రాల్లో ‘ఐఐటీ రామయ్య’గా ప్రసిద్ధి చెందిన ఈ విద్యావేత్త 101వ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(Union Minister G. Kishan Reddy) హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేశారు. పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ సభ్యులతోనూ ఆప్యాయంగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సామాన్య విద్యార్థులే లక్ష్యం
ఒకప్పుడు ఐఐటీలో సీటు సాధించడం గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులకు పెద్ద కల. అలాంటి కలలను నిజం చేసే దిశగా అడుగులు వేసిన వ్యక్తి చుక్కా రామయ్య. 1925 నవంబర్ 20న గూడూరు గ్రామంలో జన్మించిన ఆయన ఉపాధ్యాయ వృత్తితో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. విద్యతో పాటు సామాజిక మార్పు కోసం కూడా కృషి చేశారు. నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని సైతం అనుభవించారు.
ఐఐటీ కలలకు చిరునామాగా
1983లో ఉద్యోగ విరమణ చేసిన అనంతరం 1985లో హైదరాబాద్‌లో రామయ్య ఐఐటీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించారు. ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా వెనుకబడుతున్న విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఆయన మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన అనేకమంది విద్యార్థులు ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు సాధించారు. దీంతో ఆయనకు ‘ఐఐటీ రామయ్య’ అనే పేరు స్థిరపడింది.
విద్యారంగానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజా జీవితంలోనూ తనదైన ముద్ర వేశారు. 2007 నుంచి 2013 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేస్తూ విద్యా సమస్యలపై శాసనమండలిలో తన గళాన్ని వినిపించారు. విద్యకు సంబంధించిన పలు పుస్తకాలను రచించారు. వందేళ్లకు పైబడిన జీవిత ప్రయాణంలో ఎన్నో తరాలకు విద్యాబాట చూపిన రామయ్య సేవలు నేటికీ స్ఫూర్తిదాయకం. సంపాదన కంటే విద్యార్థుల భవిష్యత్తుకే ప్రాధాన్యమిచ్చిన ఆయన జీవితం ఉపాధ్యాయ లోకానికి ఒక గొప్ప సందేశం.