షేక్ హసీనా రిటర్న్ ప్లాన్.. సంచలన అడుగు!
మరణశిక్ష తీర్పు.. అయినా స్వదేశానికి వెళ్లాలని హసీనా యోచన!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా? తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ లేఖ ఈ ప్రశ్నకు కారణమైంది. కొత్త పాస్‌పోర్ట్, నేషనల్ ఐడెంటిటీ కార్డు (NIC) పొందేందుకు ఆమె తరఫున న్యాయ ప్రతినిధి ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను సంప్రదించారు. ఈ పరిణామం బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 19న ఢిల్లీలోని బంగ్లాదేశ్ తాత్కాలిక హైకమిషనర్ ప్రీతి రహమ్‌కు బ్రిటిష్ న్యాయవాది స్టీవెన్ పౌల్స్ KC లేఖ రాశారు. గతంలో నవంబర్ 9న పంపిన లేఖకు ఇంకా సమాధానం రాలేదని, అత్యవసరంగా స్పందించాలని కోరారు. షేక్ హసీనా తరఫున తాను వ్యవహరిస్తున్నట్లు నిరూపించేందుకు అధికారిక అనుమతి పత్రం కావాలని హైకమిషన్ కోరినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో హసీనా సంతకం చేసిన Authorization Letterను కూడా జత చేశారు.
కొత్త పాస్‌పోర్ట్, NIC కోసం దరఖాస్తు
నవంబర్ 9 తేదీతో ఉన్న ఆ అనుమతి పత్రంలో తన తరఫున కొత్త Passport, National Identity Card కోసం దరఖాస్తు చేసేందుకు న్యాయవాది స్టీవెన్ పౌల్స్‌కు హసీనా అధికారమిచ్చారు. లండన్‌లోని Matrix Chambersకు చెందిన ఈ Barrister ద్వారా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు అభ్యర్థన అందించారు. అయితే హైకమిషన్ ఈ దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయం ఇంకా వెల్లడికాలేదు.
స్వదేశానికి వస్తే మరణశిక్ష అమలు చేస్తారా?
2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన భారీ ప్రజా ఉద్యమం నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి భారత్‌కు వచ్చారు. డిసెంబర్‌లో తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని ఆమె గతంలో ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆమెకు స్వదేశంలో ఎదురవుతున్న న్యాయపరమైన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. 2024లో నిరసనకారులపై జరిగిన అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసేందుకు నిర్దేశించిన 30 రోజుల గడువు ముగిసిపోయిందని, ఇకపై ఆమెకు న్యాయపరమైన అవకాశాలు లేవని బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ అమీను ఇస్లాం పేర్కొన్నారు.
హసీనా తిరిగి దేశంలోకి వస్తే కోర్టు తీర్పు ప్రకారం మరణశిక్ష అమలు అవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు కొత్త పాస్‌పోర్ట్, NIC కోసం న్యాయపరమైన ప్రయత్నాలు.. మరోవైపు మరణశిక్ష తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే ఎదురయ్యే పరిణామాలు.. ఈ రెండింటి మధ్య షేక్ హసీనా తదుపరి అడుగులపై ఉత్కంఠ నెలకొంది. అయితే పాస్‌పోర్ట్ దరఖాస్తు చేయడం మాత్రమే ఆమె స్వదేశానికి తిరిగి వెళ్లడం ఖాయమైందని చెప్పడానికి ఆధారం కాదు.