100 ఎన్నికలొచ్చినా కాంగ్రెస్కు ఓటమే: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం మరింత పెరగబోతోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ(BJP) ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకుందని గుర్తుచేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధించామని, రాబోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ(MLC Elections) పార్టీ జెండా ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ఆట ఇక మొదలవుతుందని వ్యాఖ్యానించారు.
రాహుల్ వ్యాఖ్యలపై విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress Leader Rahul Gandhi)పై కూడా కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ వేదికలపై భారత రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ద్వారా దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీపై అభ్యంతరాలు ఉంటే దేశంలోనే విమర్శించాలని, విదేశాల్లో భారతదేశ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు.
దేశంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పలుమార్లు ఓటమి చవిచూసిందని, ఎన్నికల ప్రక్రియను ప్రశ్నించడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ పెరిగిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు పరాజయమే ఎదురవుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.