ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి

21-11-2026 | 12:35am

- డీజీపీకి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫిర్యాదు 

ఎల్బీనగర్, నవంబర్ 20 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో(LB Nagar Constituency) వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే పాల్గొనకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన, దుష్ప్రవర్తన, అడ్డుకుంటున్న పోలీసు అధికారులపై తగిన చర్య తీసుకోవాలన్నారు. 

పోలీసు అధికారులు పదేపదే ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడంతోపాటు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, చంపాపేట్ మోడల్ మార్కెట్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పాటించకుండా తనను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. అదేవిధంగా ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నాతో దూకుడుగా,అగౌరవంగా మాట్లాడటం ప్రారంభించి,నా వైపు దూసుకురావడానికి ప్రయత్నించారని ఆరోపించారు. 

మాపై అనుచితమైన,అవమానకరమైన వ్యాఖ్యలు కూడా చేశారని గుర్తు చేశారు. తనతో అనుచితంగా ప్రవర్తించిన చైతన్యపురి సీఐ సైదులు, డీఐ వెంకటేశ్వర్లు, సరూర్ నగర్ సీఐ శ్రీశైలం, ఎల్బీనగర్ ఏడీసీపీ రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాదిరిగా ప్రవర్తించడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో  ప్రభుత్వ నియమావళిని కచ్చితంగా పాటించేలా చూడాలని కోరారు.

మరిన్ని వార్తలు