తెలంగాణ నీళ్లపై సమరం
హైదరాబాద్: తెలంగాణ నీటి హక్కులు, సాగునీటి ప్రాజెక్టుల అంశం (Irrigation Projects) రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సుభిక్షంగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కరువు కోరల్లోకి నెట్టిందని, రాష్ట్రానికి రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తోందని ఆరోపించారు.
నీటి వినియోగంపై అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చించేందుకు సిద్ధమని హరీశ్ రావు సవాల్ విసిరారు. మూడు రోజులా.. నాలుగు రోజులా.. ఎన్ని రోజులైనా చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మైక్ కట్ చేయకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడే అవకాశం ఇవ్వాలని అన్నారు. సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా విఫలమైందో ఆధారాలతో నిరూపిస్తానని ప్రకటించారు.
రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రిని ‘కోవర్ట్, సబ్వర్ట్, పర్వర్ట్’ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు జలదోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట సభలో గంటసేపు ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్, తన పేర్లను కలిపి 140 సార్లు ప్రస్తావించారని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రదాయినిగా భావించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru-Rangareddy Project) విషయంలో కాంగ్రెస్, చంద్రబాబు పాలనలో అన్యాయం జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. మూడు దశాబ్దాలుగా పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి మహబూబ్‌నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని, కనీసం అర కిలోమీటరు కాలువ కూడా తవ్వలేదని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నీటి పండుగలు చేసుకుంటుంటే.. తెలంగాణలో రైతులకు నీళ్లు అందించలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. క్రాప్ హాలిడే (Crop Holiday) ప్రకటించాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు. 50 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందని ఆరోపించారు.
తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీటి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెబుతోంది. కృష్ణా, గోదావరి జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర వివరాలను అసెంబ్లీలో వెల్లడిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. దీంతో నీటి వాటాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఏపీకి నీటి తరలింపు అంశాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరోసారి రాజకీయ పోరుకు తెరలేపాయి.