ధోనీ రిటైర్మెంట్‌పై రోహిత్ ఎమోషనల్ పోస్ట్

18-11-2026 | 01:30pm

మలుపు తిరిగిన 'తలా' ప్రయాణం: ఆటగాడిగా వీడ్కోలు.. ఇకపై సీఎస్‌కే 'గురువు'గా ధోనీ!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి తెరపడింది. భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ( MS Dhoni IPL Retirement) ఆటగాడిగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. అయితే, అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. పసుపు జెర్సీతో ఆయన అనుబంధం ఇక్కడితో ముగిసిపోలేదు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ‘టీమ్ మెంటార్‌’గా ధోనీ సరికొత్త బాధ్యతలు నిర్వహించనున్నారు. ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియకు ముందే ధోనీ తన నిర్ణయాన్ని ఫ్రాంచైజీకి తెలియజేశారు. తనను ప్లేయర్ కాంట్రాక్ట్ నుంచి రిలీజ్ చేయాలని ఆయన స్వయంగా కోరడంతో, గౌరవప్రదంగా ఆయన్ను మెంటార్ పాత్రలోకి ఆహ్వానిస్తూ సీఎస్‌కే యాజమాన్యం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

రోహిత్ శర్మ భావోద్వేగ స్పందన

ధోనీ వీడ్కోలు నిర్ణయంపై టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. "అద్భుతమైన ఐపీఎల్ ప్రయాణం సాగించిన ధోనీ భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. మైదానంలోనూ, వెలుపల నీతో కలిసి పంచుకున్న మధుర జ్ఞాపకాలు నా జీవితాంతం గుర్తుండిపోతాయి. నీపై ఉండే గౌరవం ఎప్పటికీ తగ్గదు" అంటూ రోహిత్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ధోనీ కొత్త ఇన్నింగ్స్‌పై సీఎస్‌కే అధినేత ఎన్. శ్రీనివాసన్ స్పందిస్తూ.. ధోనీ లేని చెన్నై సూపర్ కింగ్స్‌ను అసలు ఊహించలేమని, చెన్నై ఎప్పటికీ ఆయన సొంత ఇల్లేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం జట్టు మార్పుల దశలో (Transition phase) ఉన్నందున, భవిష్యత్ తరం యువ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు ధోనీ అపార అనుభవం జట్టుకు ఎంతో కీలకమని ఫ్రాంచైజీ సహ యజమాని రూపా గురునాథ్ అభిప్రాయపడ్డారు. ఆటగాడిగా బ్యాట్‌తో, కీపింగ్‌తో మాయ చేసిన ధోనీ.. ఇకపై డగౌట్ నుంచి తన వ్యూహాలతో సీఎస్‌కేను ఎలా నడిపిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరిన్ని వార్తలు