జగన్‌పై ఈడీ పదో ఛార్జిషీట్
హైదరాబాద్: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో మరో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేసినట్లు సమాచారం. గతంలో తొమ్మిది ఫిర్యాదులు సమర్పించిన ఈడీ.. తాజా దాఖలుతో ఈ కేసులో మరో అడుగు ముందుకేసింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి గనుల లీజు కేటాయింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. ఈ లీజుల వెనుక అక్రమ లావాదేవీలు, ప్రతిఫల పెట్టుబడులు ఉన్నాయన్నది దర్యాప్తు సంస్థల ప్రధాన ఆరోపణ. సీబీఐ తన 2013 ఛార్జిషీట్‌లో జగన్, దాల్మియా సిమెంట్స్ ప్రతినిధులు తదితరులపై ఆరోపణలు చేసింది. రఘురామ్ సిమెంట్స్‌లో పెట్టుబడులు, హవాలా మార్గంలో నగదు బదిలీల అంశాలను కూడా ప్రస్తావించింది. ఈ ఆరోపణల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది.
ఈ కేసుకు సంబంధించి గతంలో సమర్పించిన ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును కొన్ని సాంకేతిక, న్యాయపరమైన కారణాలతో కోర్టు వెనక్కి పంపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అవసరమైన సవరణలు, అదనపు ఆధారాలతో తాజాగా మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో జగన్‌తో పాటు దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియా, మరికొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజా ఫిర్యాదుపై కోర్టు తదుపరి విచారణ చేపట్టాల్సి ఉంది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని ఈడీ ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.