తెలంగాణకు కొత్త హైవేలు.. త్వరలో కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రానికి కొత్త జాతీయ రహదారుల మంజూరుతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు త్వరలో కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో సుమారు రూ.93 వేల కోట్ల విలువైన రోడ్ల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
కొత్త హైవేలకు త్వరలో ఆమోదం
తెలంగాణకు సంబంధించిన పలు కొత్త జాతీయ రహదారుల(National Highways) ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వీటికి త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులకు నెల రోజుల్లో తుది అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి త్వరలో కీలక ప్రకటన వెలువడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్ఆర్ఆర్ పనుల్లో ముందడుగు
రీజినల్ రింగ్ రోడ్ (Regional Ring Road) ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని కోమటిరెడ్డి తెలిపారు. మిగిలిన పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (Hybrid Annuity Model) కింద చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు.
యాదగిరిగుట్టకు రోప్‌వే ప్రతిపాదనలు
తెలంగాణలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా యాదగిరిగుట్ట, భువనగిరి, రామగిరి ప్రాంతాల్లో ఐదు చోట్ల రోప్‌వేలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే పర్యాటకులకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడనున్నాయి.
హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్
రహదారుల నిర్మాణంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్(Indian Roads Congress) వేదికగా నిలవనుందని మంత్రి పేర్కొన్నారు. నవంబర్ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే ఈ జాతీయ సదస్సుకు దేశవ్యాప్తంగా ఇంజినీర్లు, నిపుణులు, కాంట్రాక్టర్లు, ప్రతినిధులు హాజరుకానున్నారు. రోడ్ల నిర్మాణంలో నూతన పద్ధతులు, నాణ్యత, భద్రత వంటి అంశాలపై చర్చించనున్నారు.