అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణలోని అంగన్‌వాడీ చిన్నారులకు(Anganwadi childrens) ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడే లక్ష్యంతో చేపట్టిన ‘తొలిముద్ద’ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని(Tholimudda Breakfast Scheme) మరో ఏడు జిల్లాలకు విస్తరించనుంది. నవంబర్ 19 నుంచి ఈ జిల్లాల్లో అల్పాహార పంపిణీ ప్రారంభం కానుంది.
ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 8,694 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 91,796 మంది చిన్నారులకు ఉదయం పూట పోషకాహారం అందిస్తున్నారు. తాజాగా మరో ఏడు జిల్లాలకు పథకాన్ని విస్తరించడంతో అదనంగా 43,657 మంది చిన్నారులకు ప్రయోజనం కలగనుంది.
జయశంకర్ భూపాలపల్లి, జనగామ, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో గురువారం నుంచి తొలిముద్ద పథకం అమలు చేయనున్నారు. దీంతో మొత్తం 14 జిల్లాల్లోని అంగన్‌వాడీ చిన్నారులకు అల్పాహారం అందుబాటులోకి రానుంది.
చిన్నారులకు ఉదయాన్నే పౌష్టికాహారం(Nutrition) అందించడం ద్వారా ఆకలి సమస్యను తగ్గించడంతో పాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడాలని ప్రభుత్వం భావిస్తోంది. పోషకాహారం అందితే పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మిగిలిన 19 జిల్లాల్లోనూ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు నాణ్యమైన అల్పాహారం అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.