వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు.. ఒకరి అరెస్ట్
గుజరాత్: వ్యవసాయం మాటున సాగుతున్న గంజాయి పంట గుట్టును విచ్చియా పోలీసులు రట్టు చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడటం కలకలం రేపుతోంది. విచ్చియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛాసియా గ్రామంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో రాజ్‌కోట్ రూరల్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG), యాంటీ నార్కోటిక్స్ విభాగం సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
పోలీసుల తనిఖీల్లో వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా సాగు చేసిన గంజాయి మొక్కలకు సంబంధించిన భారీ నిల్వ బయటపడింది. మొత్తం 705.49 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.52 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు లభించడంతో స్థానికంగా కలకలం రేగింది.
ఈ వ్యవహారంలో 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరా తీస్తున్నారు. గంజాయి సాగు వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పండించిన గంజాయిని ఎవరికి విక్రయించాలనుకున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కొనుగోలుదారులు, సరఫరా నెట్‌వర్క్ వివరాలను సేకరిస్తున్నారు. రాజ్‌కోట్ గ్రామీణ ఎస్పీ విజయ్ సింగ్ గుర్జర్ ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ సాగు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.