యువకుడిపై దాడి
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరాం నగర్‌లో మగ్గం దుకాణదారుల ఆందోళన
ఎల్బీనగర్, అక్టోబర్ 13: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్(Saroor Nagar Police Station) పరిధిలోని కోదండరాం నగర్ కాలనీలో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రశ్నించిన భీమ్ రాజ్ అనే యువకుడిపై సుమారు 30 మంది దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దాడిని నిరసిస్తూ కోదండరాం నగర్‌లో మంగళవారం మగ్గం దుకాణదారులు దుకాణాలను మూసి వేసి ఆందోళన చేపట్టారు.
మగ్గం దుకాణదారుల గుర్తింపు, ఆధార్ కార్డుల ప్రామాణికతపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా మంగళవారం ఉదయం కోదండరాం నగర్ కాలనీలోని మగ్గం దుకాణదారులు దుకాణాలను మూసివేశారు. కాలనీవాసుల ఆందోళన నేపథ్యంలో సరూర్‌నగర్ సీఐ శ్రీశైలం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అదేవిధంగా, కాలనీలో మగ్గం దుకాణాలు నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన ఆధార్ కార్డులను నకిలీగా పొందిన అనంతరం ఇక్కడికి వచ్చి మగ్గం దుకాణాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. సంబంధిత వ్యక్తుల గుర్తింపు, నివాస వివరాలు, ఆధార్ కార్డుల ప్రామాణికతను చట్టబద్ధంగా పరిశీలించాలని కోరారు.
కాలనీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మగ్గం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు నిర్వహించాలని సరూర్‌నగర్ సీఐ శ్రీశైలం సూచించారు. ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, కోదండరాం నగర్ కాలనీ అధ్యక్షుడు కందికంటి ప్రేమ్ నాథ్ గౌడ్, విశ్వహిందూ పరిషత్ నాయకుడు అనంత చారి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్, నాయకులు చిలుకూరి రామ్ రెడ్డి, కిట్టు, సిరి రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.