తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం
* ఖేలో ఇండియా కోసం నిధులు కేటాయించి నందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీహరి.
హనుమకొండ, నవంబర్ 20(విజయక్రాంతి): డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడల(Khelo India Games) నేపథ్యంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్‌ను(Hanamkonda Sports School) సందర్శించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ స్కూల్లో నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణాలు , క్రీడాకారుల కోసం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. క్రీడాకారులతో మాట్లాడి వారికి అందుతున్న వసతులు, శిక్షణ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
మెన్స్ జిమ్నాస్టిక్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారుల ప్రతిభను పరిశీలించి వారిని ప్రోత్సహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా క్రీడలను అందరూ సమష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఖేలో ఇండియా క్రీడల నిర్వహణతో పాటు రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం 203 కోట్లు కేటాయించిందని తెలిపారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి తగిన శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని వివరించారు. ఈ పాలసీలో భాగంగా అవసరమైన చోటా స్టేడియంలో నిర్మిస్తామన్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు.ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొనేందుకు దేశంలోని 28 రాష్ట్రాల నుంచి దాదాపు 7 వేల మంది క్రీడాకారులు తెలంగాణకు రానున్నారని, వారికి అవసరమైన అన్ని వసతులు కల్పించామని అన్నారు.
ఈ క్రీడల నిర్వహణ పూర్తయిన తర్వాత కూడా రాష్ట్ర క్రీడాకారులకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.తాము క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు, శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.