అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణ పబ్లిక్ స్కూల్' పనులకు శంకుస్థాపన
షాద్ నగర్,(విజయక్రాంతి): పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) అన్నారు. శుక్రవారం షాద్‌నగర్ నియోజకవర్గం, ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ రాజ్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పుట్టిన స్వగ్రామం కావడంతో, ఆ మహానుభావుడి కీర్తికి నివాళిగా రాష్ట్రంలోనే మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను బూర్గులలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిరంతరం శ్రమిస్తున్నారని, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల కోసం నిత్యం ఒత్తిడి తెచ్చి ఈ స్కూల్‌ను మంజూరు చేయించారని కొనియాడారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరహాలో అత్యున్నత ప్రమాణాలతో ఈ పాఠశాలను తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు హాస్టళ్లు, డైనింగ్ హాల్, ప్లేగ్రౌండ్, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తో కూడిన పౌష్టికాహారం, డిజిటల్ మరియు సాంకేతిక విద్యను అందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇంటర్మీడియట్ ను కూడా అనుసంధానించి 12వ తరగతి వరకు ఒకే చోట విద్యను అందించే ప్రణాళిక ఉందన్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని, పారదర్శకంగా బదిలీలు చేపట్టామని వివరించారు.గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను గాడిలో పెడుతూ పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని, క్రీడల్లోనూ రాణించి బూర్గుల కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు..