నిర్ణీత కాలవ్యవధిలోగా బ్రిడ్జి పనులను పూర్తి చేయాలి
- ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
- సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డు స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్, నవంబర్ 27(విజయక్రాంతి): నిర్ణీత కాలవ్యవధిలోగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను(Steel bridge construction work) పూర్తి చేయాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అధికారులను ఆదేశించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 130 - సుభాష్ నగర్ డివిజన్ పైప్లైన్ రోడ్డు స్టీల్ నిర్మాణ పనులను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అధికారులు,
భూ నిర్వాసితులతో కలిసి శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 360 మీటర్ల పొడవు, 15.50 మీటర్ల వెడల్పుతో దాదాపు 56 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా కొంపల్లి, పేట్ బషీరాబాద్ నుంచి జీడిమెట్ల పారిశ్రామికవాడ, షాపూర్ నగర్, కూకట్పల్లి వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ రద్దీ లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరడంతో పాటు జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పరిశ్రమలకు ముడి సరుకు రవాణాలో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులలో భూసేకరణ పనులు, కరెంట్ పోల్ షిఫ్టింగ్, బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో పాటు బ్రిడ్జికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు పనులను నిర్ణీత కాల వ్యవధిలోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో డిప్యూటీ కమిషనర్ లావణ్య, డిఈలు వరుణ్, దుర్గాప్రసాద్, ఏఈ శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సురేందర్, టీపీఎస్ మధు తదితరులు పాల్గొన్నారు.