పింఛన్ పైసలు పడ్డాయా? ఇలా చెక్ చేసుకోండి!
ఒకేసారి 4,89,233 మందికి పింఛన్లు.. ఖాతాల్లో నగదు!
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా పింఛన్లు(Pensions) మంజూరైన లక్షలాది మందికి ప్రభుత్వం తీపికబురు అందించింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న పలువురి నిరీక్షణకు తెరదించుతూ ఏకంగా 4,89,233 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదును జమ చేసింది. అచ్చంపేటలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కొత్త పింఛన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. కొందరు లబ్ధిదారులకు స్వయంగా ధ్రువపత్రాలు అందజేయగా, ఆ తర్వాత అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అర్హుల ఖాతాల్లోకి నగదును Direct Benefit Transfer (DBT) పద్ధతిలో బదిలీ చేశారు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని నవంబర్ నెల పింఛనుగా జమ చేసింది. డిసెంబర్ నుంచి కొత్త లబ్ధిదారులకు కూడా పాత పింఛనుదారుల మాదిరిగానే ప్రతి నెలా సాధారణ పద్ధతిలో నగదు అందనుంది. కొత్తగా పింఛన్లు పొందిన వారిలో అత్యధికంగా వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 2,89,713 మంది వితంతువులు, 53,841 మంది ఒంటరి మహిళలు కాగా.. 1,00,273 మంది దివ్యాంగులకు కూడా ప్రయోజనం కలిగింది.
ఇక కల్లుగీత కార్మికులు 27,437 మంది, చేనేత కార్మికులు 4,450 మంది ఖాతాల్లోనూ పింఛన్ సొమ్ము జమైంది. ఫైలేరియా బాధితులు 6,375 మంది, HIV/AIDS బాధితులు 2,938 మంది, డయాలసిస్ రోగులు 1,970 మందికి ప్రభుత్వం పింఛన్లు అందించింది. ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇతర విభాగాలకు చెందిన 2,236 మందికి కూడా లబ్ధి చేకూరింది. మరోవైపు పింఛనుదారులైన దంపతుల్లో ఒకరు మరణిస్తే, జీవించి ఉన్న భాగస్వామికి వెంటనే పింఛన్ అందించే Instant Pension విధానాన్ని 1,23,625 మందికి వర్తింపజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా అందించిన పింఛన్ల సంఖ్య 6,12,858కు చేరినట్లు SERP అధికారులు వెల్లడించారు. డబ్బులు పడకపోతే https://cheyutha.telangana.gov.in/SSPTG/UserInterface/Portal/GeneralSearch.aspx ఈ వెబ్ సైట్లోకి వెళ్లి మీ పెన్షన్ ఐడీ లేదా, ఆధార్ ఐడీ నంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.