ఆటపాటలతో సాగుతున్న బాలికల చదువు
బోథ్. నవంబర్ 27 ( విజయక్రాంతి): మండల కేంద్రంలో ని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో(ST Girls Ashram School) విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలన్న దృక్పథంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
ప్రతిరోజు సాయంత్రం విద్యార్థులకు ఆటపాటలు నేర్పిస్తూ చదువుపై ఆసక్తి పెరిగేలా పాఠశాల ఉపాధ్యాయులు పి ఈ టి కృషి చేయడంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నది.
సాయంత్రం వేళ ఆటపాటలు...
ప్రతిరోజు విద్యార్థులకు పి ఈ టి సాయంత్రం వేళ వ్యాయామంతో పాటు వివిధ రకాల గీతాలపై నృత్యాలు నేర్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇంటిని మరిచిపోయి హాస్టల్ పైన ఆసక్తిని పెంచుకుంటున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు చేస్తున్న నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి.
దీంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నది. ఒకప్పుడు ఇంటికి వెళ్ళిన విద్యార్థులు సెలవులు ముగిసిన హాస్టల్ కు రావాలంటే జాప్యం జరిగేది. అయితే పాఠశాలలో విద్యార్థులకు తగ్గట్టుగా పలు కార్యక్రమాలను చేపట్టడంతో సాయంత్రం వేళ సరదాగా గడుపుతున్నారు.
యోగ పై ఆసక్తి...
తమ పాఠశాలలో విద్యార్థులను చైతన్యం చేసేందుకుగాను వారిలో ఆరోగ్యం పైన దృష్టి సారించాలన్న ఆశయంతో విద్యార్థులకు యోగ తరగతులను నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ పేర్కొన్నారు. ఇటీవల 40 మంది విద్యార్థులు యోగ నేర్చుకోవడం జరిగిందన్నారు.
విద్యార్థులు యోగ ఆసనాలు వేయడంలో ముందున్నారని అయితే ఆసనాలు నేర్చుకున్న విద్యార్థులు మిగతా విద్యార్థులకు యోగ ఆసనాలు నేర్పుతున్నారు అన్నారు. ప్రతి విద్యార్థి యోగ ఆసనాలు వేయడంలో ఆసక్తి కనబరుస్తున్నారని యోగ వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు వివరించడం జరుగుతుందన్నారు. ఆటపాటలతో పాటు ఆరోగ్యం అవసరమనే విషయాన్ని విద్యార్థులు గుర్తించారని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.