ఆపదలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా

27-11-2026 | 03:36pm
  1. సర్పంచ్ దాసరి ఎల్లమ్మ శ్రీను
  2. తూర్పు గూడెంలో పథకాన్ని ప్రారంభించిన అధికారులు 

తుంగతుర్తి, (విజయ క్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించి, ఆపద సమయంలో అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా(Indiramma Family Life Insurance) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని గ్రామ సర్పంచ్ దాసరి ఎల్లమ్మ శ్రీను అన్నారు.

మండల పరిధిలోని తూర్పు గూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తుంగతుర్తి ఎంపీడీవో చలపతి తో కలిసి సర్పంచ్ ఎల్లమ్మ శ్రీను ప్రారంభించి మాట్లాడారు.అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో నమోదు చేసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న రూ.5 లక్షల జీవిత బీమా రక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులు, కుటుంబ పోషణ వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

ఒక కుటుంబంలో ఆప్తుడిని కోల్పోయిన బాధను ఎవరూ తీర్చలేరని, అయితే ఆ కుటుంబం ఆర్థికంగా మరింత కుంగిపోకుండా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు అండగా నిలిచి భవిష్యత్తుపై భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమన్నారు.

పేదల సంక్షేమం, మహిళా సాధికారత, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సందీప్, ఏవో దేవి ప్రసాద్, ఏఈఓ శ్వేత, గ్రామ కార్యదర్శి నవీన్,ఉపసర్పంచ్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలేపాక రామచంద్రు,గ్రామ శాఖ అధ్యక్షుడు గుండగాని సుధాకర్, మాజీ ఉపసర్పంచ్ గుండగాని మహేందర్, అవిలయ్య, కొమిరెల్లి, దాసరి చందు, లింగయ్య, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు