మత్తుకు నో చెప్పండి.. డ్రగ్స్ తెస్తే పాతరేస్తాం

27-11-2026 | 12:44pm

హైదరాబాద్, నవంబర్ 27: దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లో Hyderabad Walks for Nasha Mukt Bharat పాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా మైత్రివనం చౌరస్తా వద్దకు చేరుకున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ప్రజలు స్వాగతం పలికారు. సినీ నటులు నాగార్జున, సాయికుమార్ కూడా పాదయాత్రలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున విద్యార్థులతో డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. యువత భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమం తప్పకుండా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి, తమ స్కూల్ నుంచి, తమ బస్తీ నుంచి మార్పును ప్రారంభించాలని పిలుపునిచ్చారు. యువతలో Positive Thinking, Fitness, క్రమశిక్షణ పెంపొందించుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

"మా స్కూల్‌కు, మా బస్తీకి, హైదరాబాద్‌కు, తెలంగాణకు, నా భారత్‌కు ఎవడైనా డ్రగ్స్ తీసుకొస్తే.. ఈ బడా గణేష్ ముందే పాతరేస్తాం" అనే సంకల్పంతో యువత ముందుకు రావాలని నాగార్జున పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు బానిసలైతే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి బాధను అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. కన్నతల్లి కళ్ల ముందే మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఆ కుటుంబం ఎంతగా కుంగిపోతుందో యువత అర్థం చేసుకోవాలని అన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని Viksit Bharatగా, అభివృద్ధి చెందిన దేశాల సరసన అగ్రస్థానంలో నిలబెట్టాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని నాగార్జున పేర్కొన్నారు. ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేస్తారు, ఏ పార్టీ అధికారంలో ఉంటుందనేది ముఖ్యం కాదని.. దేశం మాత్రం ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకొని నిలబడాలని ఆకాంక్షించారు. భారత యువత ప్రపంచ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తూ తమ ప్రతిభతో దేశానికి గుర్తింపు తీసుకురావాలని అన్నారు.

డ్రగ్స్ వ్యసనం వల్ల యువత జీవితాలు దెబ్బతింటాయని, పంజాబ్ తరహా పరిస్థితులు ఏర్పడితే దేశం, రాష్ట్రం, హైదరాబాద్ మాత్రమే కాకుండా వ్యక్తిగత కుటుంబాలు కూడా తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. విద్యార్థులు, యువత ఎవరూ మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని స్పష్టం చేశారు. ఒకసారి వ్యసనానికి లోనైతే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజం, దేశ భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టడం కష్టమవుతుందని వివరించారు. ఇదిలా ఉండగా, పాదయాత్ర మూడో రోజు కార్యక్రమాలు కూడా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కిషన్ రెడ్డి రోజువారీ Yoga Practiceతో కార్యక్రమాన్ని ప్రారంభించి, యువత తమ శక్తిని సరైన మార్గంలో వినియోగించుకోవడానికి Fitness ఎంతో ముఖ్యమని సందేశమిచ్చారు. అనంతరం సత్యం థియేటర్ నుంచి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వరకు పాదయాత్ర చివరి దశను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత హైదరాబాద్, తెలంగాణ, భారత్ నిర్మాణమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

మరిన్ని వార్తలు