ఇందిరమ్మ ఇళ్ల చివరి విడత బిల్లులు త్వరగా చెల్లించాలి

27-11-2026 | 04:05pm

దమ్మపేట, నవంబర్ 27(విజయ క్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గంలో(Ashwaraopeta Constituency) మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చివరి విడత బిల్లుల చెల్లింపులు త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో హిమాయత్‌నగర్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నతాధికారి వెంకట్రామిరెడ్డిని కలిసి నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

మొదటి విడతలో ఇళ్లు మంజూరై నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చివరి విడత బిల్లులు త్వరగా విడుదల చేయాలని కోరారు. అలాగే వివిధ కారణాలతో బిల్లులు నిలిచిపోయిన ఇళ్లు, ఇతర పెండింగ్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సామాన్యుల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని, లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గేలా పెండింగ్ బిల్లుల చెల్లింపులు త్వరగా విడుదల చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు