డీలిమిటేషన్‌పై రాజీ లేదు.. స్టాలిన్ కీలక పోస్ట్

27-11-2026 | 03:45pm

చెన్నై: దేశవ్యాప్తంగా డీలిమిటేషన్‌(Delimitation)పై చర్చ జరుగుతున్న వేళ డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్(Tamil Nadu Former CM M.K.Stalin) మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచినా తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకూడదని తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు.

డీలిమిటేషన్ వల్ల కలిగే పరిణామాలపై దేశంలో తొలుత గళమెత్తింది డీఎంకేనేనని స్టాలిన్ పేర్కొన్నారు. న్యాయమైన నియోజకవర్గాల పునర్విభజన కోసం దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను చెన్నై వేదికగా ఒకే తాటిపైకి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి, జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు డీఎంకే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

రెండు ప్రధాన డిమాండ్లు

డీలిమిటేషన్ విషయంలో తమ పార్టీ రెండు కీలక డిమాండ్లను ముందుకు తెచ్చిందని స్టాలిన్ తెలిపారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగినప్పటికీ తమిళనాడు ప్రస్తుత 7.18 శాతం వాటా తగ్గకూడదనేది మొదటి డిమాండ్. రెండోది.. 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలన్నారు.

ఈ రెండు అంశాలపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మీడియా కథనాలు, రాజకీయ విమర్శలు తమ నిర్ణయాన్ని మార్చలేవని పేర్కొన్నారు.

తమిళనాడు ప్రయోజనాలే ముఖ్యం

డీలిమిటేషన్ విషయంలో తమిళనాడు ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్టాలిన్ తేల్చిచెప్పారు. పదవుల కోసం సిద్ధాంతాలను పక్కనపెట్టే రాజకీయ శక్తులపై కూడా తన పోస్టులో విమర్శలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో స్టాలిన్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో జరగబోయే చర్చల్లో దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు, డీఎంకే డిమాండ్లు కీలకంగా మారే అవకాశం ఉంది.


మరిన్ని వార్తలు