చేవెళ్ళలో విద్యుత్ సదుపాయాల బలోపేతం

24-10-2026 | 09:41pm

- ఈర్లపల్లి సబ్‌స్టేషన్‌లో అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రారంభం

- రూ.1.20 కోట్లతో 5 ఎంవీఏ పీటీఆర్‌ ఏర్పాటు

- ఆరు గ్రామాలకు మెరుగుపడనున్న విద్యుత్‌ సరఫరా

- 6,192 మంది విధ్యుత్ వినియోగదారులకు ఊరట

చేవెళ్ల, అక్టోబర్ 24 (విజయక్రాంతి): చేవెళ్ల ప్రాంతంలో(Chevella region) విద్యుత్‌ సరఫరాలో ఎదురవుతున్న వోల్టేజీ హెచ్చుతగ్గులు, ఓవర్‌లోడ్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఈర్లపల్లి సబ్‌స్టేషన్‌లో(Irlapalli Substation) అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (పీటీఆర్‌)ను ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ సామర్థ్యం గల పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను 33 కేవీ హెచ్‌వీ బ్రేకర్‌, 11 కేవీ ఎల్‌వీ బ్రేకర్‌తో అనుసంధానించి విజయవంతంగా ఛార్జింగ్‌ చేశారు.

ఈ పనులను రూ.1.20 కోట్ల టి అండ్‌ డి బడ్జెట్‌తో పూర్తి చేశారు. ఇప్పటికే సబ్‌స్టేషన్‌లో ఉన్న 5 ఎంవీఏ సామర్థ్యం గల పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు అదనంగా మరో 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ అందుబాటులోకి రావడంతో విద్యుత్‌ సరఫరా సామర్థ్యం పెరిగింది. దీంతో 11 కేవీ ఈర్లపల్లి ఫీడర్‌, 11 కేవీ కమ్మేట ఫీడర్‌, 11 కేవీ ఇండస్ట్రియల్‌ 24 అవర్స్‌ ఫీడర్ల పరిధిలో ఎదురవుతున్న వోల్టేజీ సమస్యలు, అధిక విద్యుత్‌ లోడ్‌ సమస్యలకు పరిష్కారం లభించనుంది.

ఈ అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా గొల్లగూడ, కమ్మేట, ఎర్లపల్లి, ఎంకేపల్లి, టంగటూర్‌, కొత్తపల్లి 6 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా అందుతోంది. మొత్తం 6,192 మంది వినియోగదారులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వీరిలో 3,542 మంది గృహ వినియోగదారులు కాగా 754 మంది వాణిజ్య వినియోగదారులు 1,896 మంది వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.

అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ అందుబాటులోకి రావడంతో గృహాలు, వాణిజ్య సంస్థలు, వ్యవసాయ అవసరాలకు విద్యుత్‌ సరఫరా మరింత మెరుగుపడనుంది. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు, పారిశ్రామిక అవసరాలకు సంబంధించి ఓవర్‌లోడ్‌ సమస్యలు తగ్గడంతో పాటు వోల్టేజీ స్థిరత్వం మెరుగుపడే అవకాశం ఉంది. రూ.1.20 కోట్లతో చేపట్టిన ఈ పనులు స్థానిక విద్యుత్‌ మౌలిక సదుపాయాల బలోపేతానికి దోహదపడనున్నాయి.

మరిన్ని వార్తలు