లెదర్ ఇండస్ట్రీకి బూస్ట్

24-10-2026 | 07:27pm

హైదరాబాద్: తెలంగాణలో తోలు పరిశ్రమల(Telangana Leather Industry) అభివృద్ధి, ఆధునిక పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్(Telangana Leather Industries Promotion Corporation) కార్యకలాపాలపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లెదర్ పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు పలు ప్రతిపాదనలను పరిశీలించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

గచ్చిబౌలిలో కామన్ ఫెసిలిటీ సెంటర్

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. తోలు పరిశ్రమలకు అవసరమైన ఉమ్మడి సదుపాయాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తయారీ కార్యకలాపాలకు తోడ్పాటు లభించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రుక్మాపూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో టానరీలు

కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చర్మశుద్ధి పరిశ్రమలను(Leather Industry) ఏర్పాటు చేసే అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. పరిశ్రమల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు.

జమ్మికుంట, ఆర్మూర్‌లో ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల ప్రతిపాదన

జమ్మికుంట, ఆర్మూర్ ప్రాంతాల్లో ప్లగ్‌-అండ్‌-ప్లే విధానంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ విధానం ద్వారా పరిశ్రమలకు అనువైన స్థలాలు, అవసరమైన ప్రాథమిక సదుపాయాలను సమన్వయంతో అందించే అవకాశాలను పరిశీలించనున్నారు.

గతంలో కేటాయించిన భూములపై ఆరా

లెదర్ కార్పొరేషన్‌కు గతంలో కేటాయించిన భూముల వివరాలతో పాటు, ప్రస్తుతం వాటి వినియోగం, స్థితిగతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని శ్రీధర్ బాబు అధికారులను కోరారు. భూముల ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత తీసుకుని, వాటిని పరిశ్రమల అభివృద్ధికి ఎలా వినియోగించుకోవచ్చో పరిశీలించనున్నట్లు ఈ సమీక్షలో చర్చించారు. లెదర్ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పాటుపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు.

మరిన్ని వార్తలు