కోనరావుపేట పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
- డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్
- జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష..
- ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన
కోనరావుపేట, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్(Medical and Health Department Officer Dr. Angela Alfred) కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మికంగా సందర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాతా శిశు ఆరోగ్య సేవలు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలను పరిశీలించారు.గర్భిణులను 12 వారాల్లోపు నమోదు చేయడంతోపాటు, వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రమాదకర గర్భధారణ కేసులను ముందుగానే గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి స్థాయిలో టీకాలు అందించాలని ఆదేశించారు.రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని,
వ్యాధిగ్రస్తులకు సకాలంలో చికిత్స అందిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా ప్రజలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు.ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న సీజనల్, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
ప్రజల్లో వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, వ్యాధులపై నిఘా కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.అనంతరం పీహెచ్‌సీ పరిధిలోని నిమ్మపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో అందిస్తున్న ఆరోగ్య సేవలను సమీక్షించారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు క్రమం తప్పకుండా వైద్య సేవలు అందించాలని, టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఆశా కార్యకర్తలు గ్రామస్థాయిలో ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలపై చైతన్యం తీసుకురావాలని తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రతి ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రభుత్వ ఆరోగ్య పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సమన్వయంతో విధులు నిర్వహించాలని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సురేష్, ఎంపీహెచ్‌ఈఓ రామణాథం, సీహెచ్‌ఓ మోహన్, ఎంపీహెచ్‌ఎస్ రషీద్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.