కోటమైసమ్మ జాతర ప్రాంతాన్నిపరిశీలించిన సీఐ
* ఈనెల 20 నుంచి జాతర
* ట్రాఫిక్, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి - సీఐ ఎన్.సాగర్, ఎస్సైబి.గోపి
సింగరేణి (విజయక్రాంతి): సింగరేణి ప్రాంతంలో అతి పెద్ద జాతర కోటమైసమ్మ జాతర ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కోటమైసమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సింగరేణి సీఐ నూనావత్ సాగర్(Singareni CI Nunawat Sagar), ఎస్సై బైరు గోపిలు జాతర జరిగే శ్రీ కోటమైసమ్మ తల్లి ఆలయ పరిసరాలను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ కు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా వాహనాల పార్కింగ్ కోసం అనువైన ప్రదేశాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఈవో కే.వెంకటయ్య లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో జాతర విజయవంతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు పగడాల మోహన్ కృష్ణ, పర్సా లలిత్ సాయి, ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాష్ శర్మ, భైరవభట్ల సాయిరాం శర్మ తదితరులు పాల్గొన్నారు.