కంటేశ్వర్ రైల్వే అండర్‌పాస్ 45 రోజుల పాటు మూసివేత
బోధన్ (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ రైల్వే అండర్‌పాస్ విస్తరణ పనుల నేపథ్యంలో అక్టోబర్ 16 నుంచి సుమారు 45 రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్(Police Commissioner Sai Chaitanya IPS) తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే చేపట్టనున్న డబుల్ ట్రాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.
నిజామాబాద్‌లోకి వచ్చే వాహనాలు గతంలో ఉన్న మార్గంలోనే అందుబాటులో ఉన్న మరో అండర్‌పాస్ ద్వారా ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకోవాలి. నగరం నుంచి ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు దేవీ రోడ్డు రైల్వే ఫ్లైఓవర్, దుబ్బా రోడ్డు, ఖానాపూర్ చౌరస్తా, మాధవ్‌నగర్ బైపాస్ మార్గాలను అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలని సూచించారు. బోధన్, బాన్సువాడ, వర్ని వైపు వెళ్లే వాహనాలు యథావిధిగా పాత మార్గంలోనే ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని కమిషనర్ కోరారు.