ఇందిరమ్మ టవర్ ఫ్లాట్లకు అర్హత నిబంధనలు ఇవే
- - సొంత ఇల్లు, ప్లాట్ ఉండకూడదు..
- - కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల్లోపే ఉండాలి
- - నిబంధనలు వెల్లడించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
బోధన్ నవంబర్ 11 (విజయక్రాంతి): ఇందిరమ్మ టవర్లో ఫ్లాట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వారు ప్రభుత్వం నిర్దేశించిన అర్హత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా సొంత ఇల్లు లేదా ఇంటి స్థలం (ప్లాట్) లేని కుటుంబాలు మాత్రమే ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు.
ఫ్లాట్ల కేటాయింపులో అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు. ఆదాయ పరిమితికి మించి ఉన్నవారు అర్హత పొందే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తుకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఒక కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయించే అవకాశం ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులు వాటిని కేటాయించిన తేదీ నుంచి పదేళ్లపాటు విక్రయించడం లేదా ఇతరులకు అద్దెకు ఇవ్వడం కుదరదని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ఈ నిబంధనలను ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ టవర్ ఫ్లాట్ల కేటాయింపులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ, నిజమైన అర్హులైన కుటుంబాలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాబట్టి ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు అర్హత నిబంధనలను పూర్తిగా తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.