గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్ సిద్ధం
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, ఆర్థిక, సామాజిక చర్చలకు హైదరాబాద్‌ను కీలక వేదికగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) వెల్లడించారు. ప్రజాస్వామ్య, ఉదారవాద, ప్రగతిశీల భావజాలాలకు భారత్ సమ్మిట్ అంతర్జాతీయ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రెండో భారత్ సమ్మిట్(Bharat Summit 2026) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు 70కి పైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధులు, విధాన రూపకర్తలు, మేధావులు హాజరుకానున్నారని వెల్లడించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వంపై ప్రపంచస్థాయి చర్చలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.
అహింస, అలీన విధానం, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సూత్రాలే తమ ఆలోచనలకు పునాదులని భట్టి విక్రమార్క వివరించారు. వ్యాపార రంగానికి దావోస్ ఎలాగో, సమానత్వానికి భారత్ సమ్మిట్ అలాంటి అంతర్జాతీయ వేదికగా ఎదగాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.
ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావాలంటే భిన్నాభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమానత్వం, ప్రజాస్వామ్య విలువలపై చర్చించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.