డీఎండబ్ల్యూఓపై చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ సమక్షంలోనే నిరసన తెలిపిన ప్రజాప్రతినిధులు, మైనారిటీ నాయకులు
ఆసిఫాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో(Official government events) ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని, ప్రజాప్రతినిధులను గౌరవించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, మైనారిటీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్, కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతోపాటు ఆహ్వాన పత్రికలు అందించకపోవడంపై జిల్లా కలెక్టర్ కె.హరిత సమక్షంలోనే డీఎండబ్ల్యూఓ తీరును తప్పుబట్టారు.
అధికారి నిర్లక్ష్యంతో ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందని, కుట్టు మిషన్ల పంపిణీలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా లేదని ఆరోపించారు.జిల్లాలోని నాలుగు మైనారిటీ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను వేడుకల్లో భాగస్వాములను చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యుడైన అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో నాయకులు శాంతించి అనంతరం వేడుకల్లో పాల్గొన్నారు.