ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కవిత శ్రీకారం

11-11-2026 | 01:39pm

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని(MLC Election Campaign) టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(TRS Party President Kalvakuntla Kavitha) ఘనంగా ప్రారంభించారు. పార్టీ అభ్యర్థులు శ్రీకాంత్ గౌడ్, ఆకాష్ కొల్లూరులకు వీరతిలకం దిద్ది, ప్రచార వాహనాలకు జెండా ఊపి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది పట్టభద్రులు ఉన్నప్పటికీ, వారిలో 10 లక్షల మంది కూడా ఓటు హక్కు నమోదు(Voter Registration) చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా, బీజేపీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌తో అవగాహనతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఈ నెల 13న సిద్ధిపేటలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని కవిత వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎన్నికల సంఘం వద్ద అధికారికంగా నమోదైందని వెల్లడించారు. పార్టీకి సంబంధించిన అభ్యంతరాలు, ఇతర సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు