23 సినిమాను ఖైదీలకు చూపిస్తాం
జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా
ప్రముఖ దర్శకుడు రాజ్ రాచకొండ రూపొందించిన మరో విభిన్న చిత్రం ‘23’. నేరస్థుల పరివర్తన, నేరలను తగ్గిస్తుందనే కథంశంతో రూపొందిన ఈ సినిమా గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ‘తెలంగాణ గద్దర్ సినీ పురస్కారాలు-2025’లోనూ సముచిత గౌరవాన్ని పొందింది.
ఈ అవార్డుల్లో స్పెషల్ జ్యూరీ అవార్డును దక్కించుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభకు జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. “ఈ సినిమా నిర్మాణం అత్యంత బాధ్యతతో, కష్టంతో కూడుకున్నది. చాలా ప్రభావవంతంగా ఉంది. ఈ ప్రయత్నం చేసిన టీమ్‌కు అభినందనలు. నేరస్థుల పరివర్తన అంశాలు కథలో బాగా పొందుపరిచారు.
జైలు జీవితాలను ఇంత వాస్తవికంగా తెరమీద ఇప్పటివరకూ చూపలేదు. ‘ది శషాంక్ రిడెంప్షన్’ వంటి గొప్ప చిత్రాల సరసన నిలబడే చిత్రం ‘23’. ఈ సినిమా ఖచ్చితంగా ఖైదీలకు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం. ఏ కొంతమందిలో మార్పు వచ్చినా అది ఈ సినిమా సాధించిన గొప్ప విజయమే” అన్నారు. ప్రముఖ దర్శకుడు బీ నర్సింగరావు మాట్లాడుతూ.. “23’ వంటి సినిమాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. ‘మా భూమి’, ‘దాసి’ వంటి వాస్తవికత దృక్పథం ఉన్న సినిమాల తర్వాత ఆ పరంపర కొనసాగలేదు.
ఇప్పుడు ‘23’ వంటి సినిమాలు వస్తున్నందుకు ఆనందంగా ఉంది” అని తెలిపారు. చిత్ర దర్శకుడు రాజ్ మాట్లాడుతూ.. “ఈ ప్రయాణంలో తోడున్న టీమ్‌కు కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రయాణం చాలా ప్రత్యేకం. మా కష్టానికి ప్రయోజనం చేకూరాలంటే జైళ్లలో ఈ సినిమా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా” అని చెప్పారు. రచయిత భరద్వాజ్ మాట్లాడుతూ.. “చిలకలూరిపేట బస్సు దహనం ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ కేసులో ఉన్న నిందితుల కథనే సినిమా చూ పిస్తుంది. ఆ నేరం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా హత్యలు చేసిన అనేక మంది విడుదలైనప్పటికీ, ఈ కేసులో ఉన్నవారికి ఇప్పటికీ ఉపశమనం లభించలేదు. వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, సమాజాన్ని కోరడమే ఈ సినిమా ఉద్దేశం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ బీనా చింతలపురి, డాక్టర్ సిద్దోజీ రావు, నటుడు తాగుబోతు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.




