7 April, 2026 | 5:19 AM

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పాటుపడాలి

07-04-2026 12:00 AM

కలెక్టర్ ప్రావీణ్య 

సంగారెడ్డి, ఏప్రిల్ 6 : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతం చేసి, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు.

జిల్లాలో ఆరోగ్య సేవల బలోపేతం, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపు లక్ష్యంగా ఈనెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమాలపై సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని  కలెక్టర్  నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డ్రగ్స్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ అధికారులు, మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

హెల్త్ వీక్ సందర్భంగా రోజువారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, జిల్లా స్థాయి కార్యాచరణ, ప్రజలకు అవగాహన కల్పించే చర్యలపై సమీక్షించి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 6 నుండి 11 వరకు జరగనున్న హెల్త్ వీక్ కార్యక్రమాలను అన్ని శాఖలు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత విస్తృతంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే ర్యాలీలను విస్తృతంగా నిర్వహించి ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం కల్పించాలని సూచించారు. హెల్త్ వీక్లో భాగంగా ఈనెల 7న  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, 8న సురక్షిత తల్లి దినం, 9న ఎయిడ్స్ అవగాహన, నివారణ దినం, 10న హోమియోపతి, ఆయుష్ దినం, 11 న ఔషధ నియంత్రణ బలోపేత దినం కార్యక్రమాల సందర్భంగా సంబంధిత అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాండు, డిఎంఅండ్ హెచ్ ఓ వసంత్ రావు, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ, జిజిహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, డీసీహెచ్‌ఎస్ కవిత, ప్రోగ్రాం అధికారులు, డాక్టర్ నాగనిర్మల, డాక్టర్ శశాంక్ ,డీడబ్ల్యుఓ లలిత కుమారి, డ్రగ్స్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ, జైలు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.