30 August, 2026 | 1:06 PM

కల్వకుర్తిలో ఘనంగా 2కే రన్‌ పోటీలు

30-08-2026 11:56 AM

కల్వకుర్తి, ఆగస్టు 30: నాగర్‌కర్నూల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్(Nagarkurnool District Athletic Association) ఆధ్వర్యంలో  ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో 2కే రన్‌ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి(Kalwakurthy MLA Kasireddy Narayana Reddy) హాజరై జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. బాలురు, బాలికలు, యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేసి అభినందించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి తగిన ప్రోత్సాహం అందిస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వారు రాణించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో పట్టణ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వాహకులు, కార్యకర్తలు, క్రీడాభిమానులు, పాల్గొన్నారు.