14 August, 2026 | 10:08 AM

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. ఇద్దరు అరెస్ట్

14-08-2026 09:08 AM

గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీ-సేవ, మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రాల నంబర్ల సేకరణ

పోలీసు అధికారులమంటూ కాల్స్ 

అత్యవసర వైద్య ఖర్చుల పేరుతో రూ.15 లక్షల వరకు మోసం

చందుర్తి,ఆగష్టు14, (విజయక్రాంతి): పోలీసు అధికారుల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌జిల్లా నిందితులను చందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీ-సేవ కేంద్రాలు, మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రాల ఫోన్ నంబర్లను సేకరించి, పోలీసు అధికారులుగా పరిచయం చేసుకుని అమాయకుల నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఇప్పటివరకు బాధితుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వీరిపై 28కు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా మోతే మండలానికి చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ మీర్‌పేట్‌లోని అల్మాస్‌గూడలో నివాసం ఉంటున్న కిలుకాని సాయిచంద్ (30), సూర్యాపేటకు చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ మీర్‌పేట్‌లో నివాసం ఉంటున్న కట్కూరి శరత్ కుమార్ (31), లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నిందితులు గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీసేవ కేంద్రాలు, మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రాల ఫోన్ నంబర్లను సేకరించేవారు. అనంతరం వారికి ఫోన్ చేసి తాము ఏఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి అనే పోలీసు అధికారిగా పరిచయం చేసుకునేవారు. పోలీసు అధికారులకు అత్యవసరంగా ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు అవసరమయ్యాయని, వెంటనే ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించాలని బాధితులను నమ్మించేవారు. నిందితులు ముందుగానే పెట్రోల్ బంక్ సిబ్బందిని సంప్రదించి, తమ వాహనం లేదా బోర్‌బండి మరమ్మతుల కోసం వచ్చిందని, తమ సార్ డబ్బులు వారి ఫోన్ నంబర్‌కు పంపిస్తారని చెప్పి వారి నంబర్‌ను తీసుకునేవారు. అనంతరం ఆ నంబర్‌ను మీ-సేవ నిర్వాహకులకు ఇచ్చి బాధితుల నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేయించేవారు. డబ్బులు బదిలీ అయిన తర్వాత పెట్రోల్ బంక్‌కు వెళ్లి నగదును తీసుకునేవారని డీఎస్పీ తెలిపారు.

ఇదే విధంగా నిందితులు చందుర్తి మండలానికి చెందిన చిలుక పెంటయ్యకు ఫోన్ చేసి తాము చందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డిగా మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నారు. తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించామని, అత్యవసరంగా రూ.70,000 అవసరముందని, డబ్బులు పంపిస్తే హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇస్తానని నమ్మించారు. వారి మాటలను నమ్మిన పెంటయ్య డబ్బులు పంపేందుకు సిద్ధం కాగా, నిందితులు హైదరాబాద్‌లోని ఓ పెట్రోల్ బంక్ ఫోన్ నంబర్‌ను ఇచ్చారు. దీంతో పెంటయ్య ఆ నంబర్‌కు రూ.70,000 ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. డబ్బులు పంపిన అనంతరం నిందితులు మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన పెంటయ్య చందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు చందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చందుర్తి సీఐ రవీందర్, ఎస్‌ఐ రమేష్, సైబర్ క్రైమ్ ఆర్‌ఎస్‌ఐ జునైద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నేరం ద్వారా సమకూరిన సొమ్ములో భాగంగా రూ.18,000 నగదు, నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన చందుర్తి సీఐ రవీందర్, ఎస్‌ఐ రమేష్, ఆర్‌ఎస్‌ఐ జునైద్, సిబ్బంది అనిల్, గంగారెడ్డిలను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.