17 August, 2026 | 5:06 PM

ప్రజావాణీలో పలు సమస్యలపై తుడుందెబ్బ వినతి పత్రం

17-08-2026 04:16 PM

-సమస్యలను వెంటనే పరిష్కరించాలి: మండల అధ్యక్షులు గోవింద నర్సింహారావు

గుండాల, (విజయక్రాంతి): మండల కేంద్రంలో మొదటి రోజు నిర్వహించిన ప్రజావాణీ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తుడుందెబ్బ మండల అధ్యక్షులు గోవింద నర్సింహారావు అధికారులకు సమర్పించారు. అనంతరం నర్సింహారావు మాట్లాడుతూ.. మండల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, ఫార్మాసిస్టులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో మందుల కొరతను వెంటనే నివారించాలని కోరారు.

మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం ఎంతో కీలకమని, అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. యూరియా ఆన్‌లైన్ విధానంలో సరఫరా చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరాలో ఉన్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని కోరారు.

నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత ఏర్పడటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా అవసరమైన ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులు సకాలంలో మంజూరు కాక లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

ముఖ్యంగా గామాలపాటి నగేష్ ఇంటి నుంచి ఆవుల వెంకన్న ఇంటి వరకు, నునావత్ మోహన్ ఇంటి నుంచి చుంచు సాంబశివరావు ఇంటి వరకు, వజ్జ నారాయణ ఇంటి నుంచి వెంకటేశ్వర్ల ఇంటి వరకు సీసీ రోడ్లు మంజూరు చేసి నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సానుకూలంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు.